Clock Of Nellore ( Nellore ) – నిరుపేద ప్రజలకు న్యూరాలజీ వైద్య సేవలను ఉచితంగా అందజేస్తూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన డాక్టర్ బింధు మీనన్ ఫౌండేషన్ 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని, 12వ పడిలోకి అడుగుపెట్టింది. ఫౌండేషన్ కార్యదర్శి డాక్టర్ బింధు మీనన్ ఆధ్వర్యంలో నిర్విగ్నంగా వైద్య సేవలు కొనసాగుతున్నాయి. 12వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా డాక్టర్ బింధు మీనన్ ఆధ్వర్యంలో నెల్లూరు రామ్మూర్తినగర్ లోని వారి కార్యాలయంలో వార్షికోత్సవ సభను ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆనంద్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిభిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఫౌండేషన్ సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య భద్రత విషయంలో ఫౌండేషన్ పేరుతో డాక్టర్ బింధు మీనన్ చేస్తున్న సేవలను కలెక్టర్ కొనియాడారు. డాక్టర్ బింధు మీనన్ ను ఇతర వైద్యులు కూడా ఆదర్శంగా తీసుకుని సొంత లాభం కొంత వదులుకొని, పొరుగు వారికి సాయపడేలా ముందుకు సాగాలన్నారు. ఆమె చేస్తున్న ఉచిత వైద్య సేవలే ఆమెను అంతర్జాతీయ స్థాయిలో నెలబెట్టాయని ప్రశంసించారు.
అనంతరం డాక్టర్ బింధు మీనన్ ఫౌండేషన్ కార్యదర్శి డాక్టర్ బింధు మీనన్ మాట్లాడారు. నరాలకు సంభందించిన సమస్యలు, వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటూ నరాల ఆరోగ్యాన్ని పెంపొందించడంలో డాక్టర్ బింధు మీనన్ ఫౌండేషన్ గణనీయమైన పురోగతిని సాధించిందని చెప్పుకొచ్చారు. ప్రధానంగా నిరుపేదలకు వారు నివాసం ఉండే ప్రదేశంలోనే ఉచిత న్యూరాలజీ వైద్య సేవలను అందించడమే ధ్యేయంగా ఫౌండేషన్ పనిచేసిందని గుర్తు చేశారు. ఇప్పటి వరకూ గ్రామీణ ప్రాంతాల్లో 250 ఉచిత ఆరోగ్య శిభిరాలు, 248 అవగాహన కార్యక్రమాలను నిర్వహించామని వివరించారు. ఎక్కడా లేని విధంగా న్యూరాలజీ ఆన్ వీల్స్ పేరుతో తనతో పాటూ నిపుణులైన ఇతర వైద్యులను కూడా నేరుగా రోగుల ఇంటి వద్దకే వెళ్లి ఉచితంగా వైద్య సేవలను అందించామని డాక్టర్ బింధు మీనన్ గుర్తు చేశారు. రానున్న రోజుల్లో కూడా ఇది కొనసాగుతుందని స్పష్టం చేశారు. అంతే కాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా స్ట్రోక్ ఎపిలెప్సీ, మైగ్రేన్ రోగుల కోసం న్యూరాలాజికల్ మొబైల్ యాప్ లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. నిరుపేద రోగులకు ఆరోగ్య భరోసాను ఇస్తూ డాక్టర్ బింధు మీనన్ ఫౌండేషన్ నిరంతరాయంగా ముందుకు సాగుతుందని వెల్లడించారు. న్యూరాలజీ సమస్యలు, రోగాలతో బాధపడే నిరుపేదలకు ఉచిత వైద్యం అందాలనే సంకల్పంతో తనను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న ఫౌండేషన్ ఛైర్మైన్ K.M.R నంబియార్, వైస్ ఛైర్మైన్ భార్గవి నంబియార్ లకు డాక్టర్ బింధు మీనన్ కృతజ్ఞతలు తెలియజేశారు.