Clock Of Nellore ( Naidupeta ) – నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో విద్యార్దులకు కలుషిత ఆహారం వడ్డించేందుకు కారణమైన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తిరుపతి జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. కలుషిత ఆహారం తిని సుమారు 100 మంది విద్యార్ధులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. విద్యార్ధులకు వాంతులు, విరేచనాలు కావడంతో వారిని నాయుడుపేట, గూడూరు, నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలకు తరలించారు. విషయం తెలుసుకున్న మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి హుటాహుటిన నాయుడుపేటకు చేరుకున్నారు. తిరుపతి కలెక్టర్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ తో కలిసి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్ధులను పరామర్శించారు. విద్యార్ధులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. విద్యార్ధులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటి ఏర్పాటు చేసి కలుషిత ఆహారం వడ్డించేందుకు కారణమైన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను ఆదేశించారు. అనంతరం గూడూరు, నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలల్లో చికిత్స పొందుతున్న విద్యార్ధులను కూడా పరామర్శించారు.