Clock Of Nellore ( Amaravathi ) – నెల్లూరు జిల్లా నుండి ఇద్దరికి మంత్రులుగా అవకాశం దక్కింది. నెల్లూరు సిటీ నుండి విజయం సాధించిన డాక్టర్ పొంగూరు నారాయణ, ఆత్మకూరు నుండి జయభేరి మోగించిన ఆనం రామ నారాయణరెడ్డిలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒకే జిల్లా నుండి ఇద్దరికి అవకాశం రావడం పట్ల జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పని విధానం, సీనియర్లు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. పొంగూరు నారాయణ 2014 నుండి 2019 వరకూ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ ఐదేళ్లు పనితీరుతో తనదైన ముద్ర వేసుకున్నారు. అంతే కాకుండా రాజధాని నిర్మాణంలో నారాయణ కీలక భూమి పోషించారు. ఆయన పనితీరును బట్టే రెండో సారి మంత్రిగా అవకాశం లభించింది అనడం సందేహం లేదు. ఇక ఆనం రామ నారాయణరెడ్డి. ఆయన కూడా సీనియరే. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కొణిజేటి రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లలో ఆనం మంత్రిగా సేవలందించారు. ప్రభుత్వంలో కీలకమైన ఆర్ధిక శాఖ మంత్రి గానూ సేవలందించి తనదైన ముద్ర వేసుకున్నారు. ఆనం రామ నారాయణ రెడ్డి పనితీరు మెచ్చే ఆయనకు చంద్రబాబు మంత్రిగా అవకాశం కల్పించారు. ఈ ఇద్దరికీ పాత శాఖలే కేటాయించే అవకాశం ఉంది. నారాయణకు పురపాలకశాఖ మంత్రిత్వంతో పాటూ రాజధాని నిర్మాణ పనులు, ఆనం రామ నారాయణరెడ్డికి ఆర్ధిక మంత్రిత్వాన్నే కేటాయించే అవకాశాలు ఉన్నాయి.