Clock Of Nellore ( Nellore ) – విజయవాడ సమీపంలోని గన్నవరం కేసరపల్లి ఐటీ పార్కు వద్ద ఈనెల 12న నిర్వహించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని జిల్లా నుంచి ప్రజలు వీక్షించేందుకు 17 ప్రదేశాల్లో ఎల్ఈడీ స్క్రీన్ లను ఏర్పాట్లు చేస్తున్నట్లు నెల్లూరు జిల్లా ఇన్‌చార్జి కలెక్టరు వికాస్ మర్మత్ పేర్కొన్నారు. సీఎంగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై సోమవారం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ వికాస్ మర్మత్ సమావేశం, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టరు మాట్లాడుతూ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించేందుకు ప్రతీ నియోజక వర్గంలో రెండు ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయాలని, మండపాల్లో తాగునీరు, స్నాక్స్ అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా 17 ప్రదేశాల్లో ఈ లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తరలి వెళ్లేందుకు జిల్లాలో ఎంపిక చేసిన ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు బయలుదేరనున్నట్లు చెప్పారు. ఒక్కొక్క నియోజకవర్గానికి నాలుగు ఆర్టీసీ బస్సుల చొప్పున జిల్లాలో 32 బస్సులు కేటాయించామని, స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని ఈనెల 11వ తేదీ రాత్రి 10 గంటలకల్లా బస్సులు బయలుదేరేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రతి బస్సుకు ఒక ఇన్‌చార్జిని నియమించాలన్నారు. ఈనెల 12వ తేదీ ఉదయానికి బస్సులు గుంటూరు చేరుకుంటాయని, అక్కడ కల్యాణ మండపంలో ఫ్రెష్‌అప్ అవడానికి, అల్పాహారం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. పాసులు కలిగిన వారిని మాత్రమే బస్సుల్లో ఎక్కించాలని, పాసులను స్థానిక ఎమ్మెల్యే అందిస్తారని చెప్పారు. అలాగే అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఈనెల 10వ తేదీ నుంచి 12వ తేదీ రాత్రి వరకు విద్యుత్ దీపాలను అమర్చి అందంగా ముస్తాబుచేయాలన్నారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లను ఎటువంటి లోటుపాట్లు లేకుండా చేపట్టాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో జాయింట్ కలెక్టర్ సేదు మాధవన్, డిఆర్‌వో లవన్న డిఆర్‌డిఎ, డ్వామా పీడీలు సాంబశివారెడ్డి, వెంకట్రావు, ఆర్టీసీ ఆర్‌ఎం శేషయ్య, ఎంపిడీవోలు, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.