కౌంటింగ్ కు సర్వం సిద్ధం : వివరాలు వెల్లడించిన కలెక్టర్ హరి నారాయణన్

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు జిల్లాలో జూన్‌ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం. హరి నారాయణన్‌ తెలిపారు. మంగళవారం సాయంత్రం నెల్లూరు కలెక్టరేట్‌లోని మీడియా సెంటర్‌లో కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌, ఎస్పీ ఆరీఫ్‌ హఫీజ్‌ సంయుక్తంగా కౌంటింగ్‌ ఏర్పాట్లపై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును కనుపర్తిపాడులోని ప్రియదర్శిని కాలేజీలో జూన్‌ 4న ఉదయం 8 గంటలకు ప్రారంభిస్తామన్నారు. జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి ఈవీఎం ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 8 అసెంబ్లీ నియోజవర్గాలకు కలిపి 7,63,894 పురుషుల ఓట్లు, 7,84,219 మహిళల ఓట్లు, ఇతరుల ఓట్లు 70 మొత్తం 15,48,183 ఓట్లు పోలయ్యాయని కలెక్టరు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా పోస్టల్‌ బ్యాలెట్‌కు సంబంధించి సర్వీసు ఓట్లు 24,223, హోం ఓటింగ్‌కు సంబంధించి 85 సంవత్సరాల పైబడిన వృద్దుల ఓట్లు 870, వికలాంగుల ఓట్లు 753 మొత్తం 25846 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు నమోదుకాగా, నెల్లూరు పార్లమెంటుకు సంబంధించి 23,967 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు పోలైనట్లు కలెక్టర్‌ వివరించారు. కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ఫలితాలు 20 రౌండ్లలో, కావలి ఫలితాలు 23 రౌండ్లు, ఆత్మకూరు ఫలితాలు 20 రౌండ్లు, కోవూరు ఫలితాలు 24 రౌండ్లు, నెల్లూరు సిటీ ఫలితాలు 18 రౌండ్లు, నెల్లూరు రూరల్‌ ఫలితాలు 21 రౌండ్లు, ఉదయగిరి ఫలితాలు 24 రౌండ్లు, సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఫలితాలు 21 రౌండ్లలో వెల్లడికానున్నట్లు చెప్పారు. నెల్లూరు పార్లమెంటుకు సంబంధించి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు ఏర్పాటు చేయగా, 4 రౌండ్లలో ఫలితాలు వెల్లడి కానున్నట్లు చెప్పారు. కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపునకు 2 టేబుళ్లు ఏర్పాటు చేయగా 3 రౌండ్లలో ఫలితాలు వెల్లడికానున్నట్లు చెప్పారు. అలాగే కావలికి 2 రెండు టేబుళ్లు 4 రౌండ్లు, ఆత్మకూరుకు రెండు టేబుళ్లు 4 రౌండ్లు, కోవూరుకు రెండు టేబుళ్లు 4 రౌండ్లు, నెల్లూరుసిటీకి 2 టేబుళ్లు 4 రౌండ్లు, నెల్లూరు రూరల్‌కు 6 టేబుళ్లు 2 రౌండ్లు, ఉదయగిరికి 2 టేబుళ్లు 4 రౌండ్లు, సర్వేపల్లికి 2 టేబుళ్లు 2 రౌండ్లలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలు వెల్లడికానున్నట్లు కలెక్టరు చెప్పారు. కౌంటింగ్‌ అబ్జర్వర్లు కౌంటింగ్‌ ప్రక్రియను పర్యవేక్షించనున్నట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు.

మీడియా కేంద్రం ఏర్పాటు…
ఎప్పటికప్పుడు ఓట్ల లెక్కింపు ఫలితాలు వెల్లండించేందుకు ప్రియదర్శిని కళాశాల కౌంటింగ్‌ కేంద్రంలో మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ చెప్పారు. ఇప్పటి వరకు 70మంది పాత్రికేయులకు మీడియా పాసులు అందించామని, ప్రతి ఒక్కరూ తమ పాస్‌ను తప్పకుండా తీసుకురావాలని, పాస్‌ ఉన్న వారినే కౌంటింగ్‌ కేంద్రంలోనికి అనుమతిస్తామని కలెక్టర్‌ స్పష్టం చేశారు. మీడియా పాసులు కలిగిన పాత్రికేయులకు మీడియా సెంటర్ వరకు సెల్ ఫోన్ లకు అనుమతి ఉంటుందని, కౌంటింగ్‌ హాలు, స్ట్రాంగ్‌ రూంల వద్దకు సెల్‌ఫోన్లు పూర్తి నిషేధమన్నారు. మీడియా కేంద్రంలో వార్తలు వేగంగా పంపేందుకు కంప్యూటర్లు, ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. మీడియా వారు విడతల వారీగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కౌంటింగ్‌ కేంద్రాలకు వెళ్లి తిరిగి మీడియా కేంద్రానికి చేరుకోవాలన్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, టీ, స్నాక్స్‌ వంటి భోజన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మీడియా కవరేజికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు.

కౌంటింగ్‌ రోజున జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలు – ఎస్పీ ఆరీఫ్ హఫీజ్
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా జూన్‌ 4వ తేదీన జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఆరీఫ్‌ హఫీజ్‌ పేర్కొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సజావుగా కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తి చేసేందుకు కౌంటింగ్‌ కేంద్రం మూడంచెల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ చెప్పారు. ఎటువంటి డ్రోన్లు ఎగరవేయకుండా కౌంటింగ్‌ కేంద్రాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించినట్లు చెప్పారు. ఎటువంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని, ఇందుకు రాజకీయపార్టీలు సహకరించాలని ఎస్పీ కోరారు. పోలింగ్‌ రోజున ఎటువంటి బందోబస్తు చర్యలు చేపట్టామో అదే తరహాలో కౌంటింగ్‌ రోజున కూడా స్టేట్‌, ఆర్మ్‌డ్‌, సిఆర్‌పిఎఫ్‌ బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. కనుపర్తిపాడులోని జిల్లా పరిషత్‌ హైస్కూలు వరకు మాత్రమే పార్కింగ్‌కు అనుమతి వున్నట్లు చెప్పారు. అబ్జర్వర్లు, అభ్యర్థులు, ఎలక్షన్‌ ఏజెంట్ల వాహనాలకు మాత్రం కౌంటింగ్‌ గేటు ముందు 100 మీటర్ల వరకు మాత్రం వాహనాలకు అనుమతి వుందని ఎస్పీ చెప్పారు. భారత ఎన్నికల సంఘం నిబంధనలను పక్కాగా అమలు చేస్తూ శాంతి భద్రతలకు ఇబ్బందులు లేకుండా సజావుగా కౌంటింగ్‌ ప్రక్రియను పూర్తి చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ ఆరీఫ్‌ హఫీజ్‌ స్పష్టం చేశారు.

Read Previous

కోటంరెడ్డికి వినూత్నంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు : అరేబియాలో మదన్ సాహసం

Read Next

ఘనంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు : వివిధ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు

Leave a Reply

Your email address will not be published.