Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు జిల్లాలో ఎన్నికల తర్వాత రాజకీయ ఘర్షణలు, అల్లర్లు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నెల్లూరు కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల నోడల్ ఆఫీసర్లతో ఎన్నికల ప్రవర్తన నియమావళి మరియు కౌంటింగ్ ప్రక్రియపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు రాబోయే 13 రోజులు అప్రమత్తంగా ఉండి, ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని అన్నారు. జిల్లాలో ఎన్నికల తర్వాత క్షేత్రస్థాయిలో ఘర్షణలు జరగకుండా ప్రశాంత వాతావరణం కల్పించాలన్నారు. జిల్లాలో ఎన్నికలు పూర్తయినప్పటికీ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంతవరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందన్నారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని రిటర్నింగ్ అధికారులు తూచా తప్పకుండా అమలు చేయాలన్నారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఒక స్టాటిక్ సర్వైలెన్స్ మరియు అన్ని ఎఫ్.ఎస్.టి టీములు కొనసాగిస్తున్నామన్నారు. ఎన్నికల సంఘం ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఎత్తివేసినట్లు ప్రకటించే వరకు కూడా అధికారులందరూ గమనిస్తూ ఉండాలన్నారు. జిల్లాలో మండలాలకు నియమించిన నోడల్ అధికారులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని పరిశీలించాలన్నారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని రిటర్నింగ్ అధికారులు, నోడల్ ఆఫీసర్లు పరిశీలించాలన్నారు.
జిల్లాలో క్షేత్రస్థాయిలో రాజకీయ ఘర్షణలు జరగకుండా కిందిస్థాయి సిబ్బందితో సమాచారం తెప్పించుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. రాజకీయ ఘర్షణలపై ఎన్నికల సంఘం సీరియస్ గా ఉందన్నారు. మండల స్థాయిలో తహసిల్దార్లు, పోలీసు అధికారులు సంయుక్తంగా వెళ్లి గ్రామాల్లో పర్యటించా లన్నారు. జిల్లాలో ఎన్నికలపై ఫిర్యాదులు వస్తున్నాయని ప్రతి ఫిర్యాదును పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఉన్న ఎన్నికల స్ట్రాంగ్ రూములను రిటర్నింగ్ అధికారులు ప్రతిరోజు సందర్శించాలన్నారు. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ జరుగు తున్నందున కౌటింగ్ కేంద్రాలలో అవసరమైన సౌకర్యాలు కల్పించాలని రిటర్నింగ్ అధికారులు ఆదేశించారు. కౌంటింగ్ నిర్వహణకు అవసరమైన సిబ్బందిని కేటాయించాలని అధికారులకు సూచించారు. కౌంటింగ్ కు నియమించిన సిబ్బందికి త్వరలో శిక్షణ ఇస్తామని కలెక్టర్ చెప్పారు. మండు వేసవిలో కూడా ఎన్నికల విధులను సమర్ధవంతంగా నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ సౌజన్య, కోవూరు రిటర్నింగ్ అధికారి సేదు మాధవన్, నెల్లూరు సిటీ రిటర్నింగ్ అధికారి వికాస్, కందుకూరు రిటర్నింగ్ అధికారి జి. విద్యాధరి, కావలి రిటర్నింగ్ అధికారి సీనా నాయక్, ఆత్మకూరు రిటర్నింగ్ అధికారి కే. మధులత, సర్వేపల్లి రిటర్నింగ్ అధికారి బి.చిన్న ఓబులేష్, ఉదయగిరి రిటర్నింగ్ అధికారి ప్రేమ్ కుమార్, నోడల్ ఆఫీసర్లు టీ.బాపిరెడ్డి ఎస్. రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.