Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లాలో ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు జిల్లా కలెక్టర్ హరి నారాయణన్. జూన్ 4న చేపట్టనున్న కౌంటింగ్ కు సంభందించి సిబ్బందికి శిక్షణా తరగతులను ఏర్పాటు చేస్తున్నారు. ఈవీఎం మిషన్లకు సీలు ఎలా తొలగించాలి, దానిలో నిర్లిప్తమైన ఓట్లను ఏ విధంగా లెక్కించాలని అనే సాంకేతిక అంశాలపై బెల్ కంపెనీ ఇంజనీరింగ్ నిపుణులతో శిక్షణా తరగతులను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంటు నియోజకవర్గానికి సంభందించిన ఈవీఎంలను నెల్లూరు కనుపర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. కేంద్ర భద్రతా దళాలతో వాటికి మూడంచెల భద్రతను కల్పించారు. ప్రతీ రోజూ జిల్లా కలెక్టర్ హరినారాయణన్, జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ లు స్ట్రాంగ్ రూముల వద్దకు వెళ్లి భద్రతను తనిఖీ చేస్తున్నారు. స్ట్రాంగ్ రూముల చుట్టూ ఏర్పాటు చేసిన నిఘా కెమరాలను పరిశీలిస్తున్నారు. జూన్ 4న ప్రశాంతమైన వాతావరణంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంతో పాటూ నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కోవూరు, ఆత్మకూరు, ఉదయగిరి, కందుకూరు, కావలి, సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంభందించి ఇక్కడ లెక్కింపు జరగనుంది.