నెల్లూరుజిల్లాలో కాంగ్రెస్ కు తిరిగి జీవం పోసిన కొప్పుల రాజు : ఎఫెక్ట్ ఎవరిపైనో ?

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లాకు సుదీర్ఘ కాలంగా కలెక్టర్ గా సేవలందించి ప్రజల ప్రసంశలు అందుకున్న మాజీ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజు అదే జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి తిరిగి జీవం పోశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున నెల్లూరు ఎంపిగా పోటీ చేసిన కే. రాజు దిగ్గజాలుగా బరిలో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, విజయసాయి రెడ్లకు తీసిపోని పోటీ ఇచ్చారు. రెండు రోజుల ముందు వరకూ ఇవన్నీ ఒట్టి మాటలే అనుకున్నారు అందరూ… కానీ 13వ తేదీ పోలింగ్ జరిగిన తీరు చూస్తే కొప్పుల రాజు ఏ మాత్రం పోటీ ఇచ్చారో అర్ధమవుతుంది. ప్రధానంగా మైనార్టీ, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు ఆయనకు అధికంగా ఓట్లు వేసినట్లు పరిశీలనలో సుస్పష్టమైంది. కొప్పుల రాజు కూడా ఏదో పోటీ చేశామా అన్న విధంగా కాకుండా తన పని తాను సైలెంట్ గా చేశారు. ఆయన కోసం ఢిల్లీ నుంచి 50 మందితో కూడిన టీం నెల్లూరులో మకాం వేసింది. నెల్లూరులోని బృందావనంలో ఓ భవంతిని కార్యాలయంలా మార్చుకున్న కొప్పుల రాజు… స్థానికంగా ఉండే 100 మంది యువతతో ప్రత్యేక టీంను ఏర్పాటు చేసుకున్నారు. ఏకంగా తాత్కాలిక కాల్ సెంటర్ నే ఏర్పాటు చేసి నెల్లూరు యువతతో ఓటర్లతో మాట్లాడించారు. కొప్పుల రాజు ఎవరు… కాంగ్రెస్ కే ఎందుకు ఓటు వేయాలి… వైసీపికి వేసినా, టిడిపికి వేసినా బిజేపికి వేసినట్లేనని కాల్ సెంటర్ ద్వారా ఓటర్లకు సమాచారం ఇప్పించారు. ప్రధానంగా ఆయన మైనార్టీ, ఎస్సీ సామాజిక వర్గాలను ఆకట్టుకున్నారు. వివిధ రాష్ట్రాల నుండి కాంగ్రెస్ పార్టీ నేతలను నెల్లూరుకు రప్పించి, ఆయన గొప్పతనం గురించి వారిచే నెల్లూరు జిల్లా ప్రజలకు తెలియజేయించారు. బడా నేతలకు తీసిపోని విధంగా ఖర్చు కూడా బాగానే పెట్టారు. ఛానల్స్, న్యూస్ పేపర్లో యాడ్స్ కూడా ప్రధాన పార్టీలకు తీసిపోని విధంగా ఇచ్చి ఓటర్లకు తానెవరో తెలియజేశారు. ఎంపి అభ్యర్ధిగా కొప్పుల రాజు కాకుండా వేరే వ్యక్తి అయితే ఇంత ఎఫెక్ట్ ఉండదేమో అనిపిస్తుంది. దానికి తోడు అనేక మంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు నెల్లూరులో కే. రాజుకు మద్దతుగా ప్రచారం కూడా నిర్వహించారు.

మైనార్టీ, ఎస్సీ సామాజిక వర్గంలోని క్రైస్తవులకు భారతీయ జనతా పార్టీపై ఓ రకమైన భావన ఉంది. ఇదే అంశాన్ని తీసుకున్న కొప్పుల రాజు టిడిపికి ఓటు వేసినా, వైసీపికి ఓటు వేసినా బిజేపికి వేసినట్లేనని ప్రచారం చేశారు. కేంద్రంలో బిజేపి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్పు చేస్తారని, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు తొలగిస్తారని కే. రాజు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. దీనికి తోడు కాంగ్రెస్ కు కొంత మేర సాంప్రదాయ ఓటింగ్ ఉంది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపిలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. 2019లో కూడా అదే సీన్ రిపీట్ అయింది. తాజాగా ఏపి కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించడం, ఆమెకు ప్రజల్లో కొంత మేర చరిష్మా ఉండటంతో కాంగ్రెస్ తిరిగి నెమ్మదిగా అడుగులు వేస్తుంది. ఇదే క్రమంలో జిల్లా కలెక్టర్ గా పనిచేసిన కొప్పుల రాజు నెల్లూరు ఎంపి అభ్యర్ధిగా రావడంతో ఆయన ద్వారా జిల్లాలో కాంగ్రెస్ కు జీవం పోసినట్లే అని అనుకోవచ్చు. ప్రధానంగా నెల్లూరు సిటీ, కోవూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో కొప్పుల రాజుకు ఓ మాదిరిగానే ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. నెల్లూరు రూరల్ లో కూడా అక్కడక్కడా కే. రాజుకు ఓట్లు పోలయ్యాయి. పార్లమెంటు నియోజకవర్గానికి సంభందించి ఈవిఎం మిషన్ బ్యాలెట్ లో కొప్పుల రాజు పేరు మొదటిగా ఉండటం కూడా ఆయనకు ప్లస్ పాయింట్ అయింది. అయితే ఆయనకు ఎన్ని ఓట్లు పోలయ్యాయి… ఆ ఎఫెక్ట్ ఎవరిపై చూపుతుందో తెలియాలంటే వచ్చే నెల 4వ తేదీ జరిగే ఓట్ల లెక్కింపు వరకూ వేచి చూడాల్సిందే.

Read Previous

నారాయణ సార్ విజయం పక్కా … ధీమా వ్యక్తం చేస్తున్న టిడిపి శ్రేణులు

Read Next

జాన్ 4న వెలువడనున్న ఫలితాలు : కౌంటింగ్ కు చురుగ్గా ఏర్పాట్లు

Leave a Reply

Your email address will not be published.