Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లాలోని 8 నియోజకవర్గాలకు సంభందించి ఈవీఎం మెషీన్లు స్ట్రాంగ్ రూములకు చేరాయి. సోమవారం రాత్రి 10 గంటల వరకు కూడా కొన్ని చోట్ల పోలింగ్ జరగడం, సుదూర ప్రాంతాల నుండి తరలించడం తదితర కారణాలతో ఈవీఎం మెషీన్లు అర్ధరాత్రి తర్వాత స్ట్రాంగ్ రూముకు చేరాయి. జిల్లాలోని 8 నియోజకవర్గాలకు సంభందించి స్ట్రాంగ్ రూములను నెల్లూరు కనుపర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో అధికారులు ఏర్పాటు చేశారు. మంగళవారం తెల్లవారు జామున అన్నీ నియోజకవర్గాలకు సంభందించి ఈవీఎం మెషీన్లను పోలింగ్ సిబ్బంది పూర్తి స్థాయిలో ప్రియదర్శిని కళాశాలకు తీసుకురాగా, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో వాటిని స్ట్రాంగ్ రూముల్లో ఉంచి సీల్ వేశారు. జిల్లా కలెక్టర్ హరి నాారాయణన్ రాత్రి మొత్తం ప్రియదర్శిని కళాశాల వద్దే ఉన్నారు. నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాలకు సంభందించిన ఈవీఎం మెషీన్లను సిబ్బంది రాత్రి 11 గంటల ప్రాంతంలో తీసుకురాగా, ఉదయగిరి, ఆత్మకూరు, కావలి, కోవూరు, కందుకూరు, సర్వేపల్లి నియోజకవర్గాలకు చెందిన ఈవీఎం మెషీన్లను ప్రియదర్శిని కళాశాలకు సిబ్బంది తీసుకువచ్చేలోగా అర్ధరాత్రి అయింది. నియోజకవర్గాల వారీగా వాటిని వేరు వేరు గదుల్లో భద్రపరిచి, సీల్ వేశారు. కేంద్ర భద్రతా దళాలు వాటికి బందోబస్తుగా ఉన్నాయి. స్ట్రాంగ్ రూముల వద్ద నిరంతరం పర్యవేక్షణకు సిసి టివి కెమరాలను కూడా అమర్చారు. అభ్యర్ధులు ఎప్పుడైనా స్ట్రాంగ్ రూముల వద్దకు వెళ్లి సిసి టీవి కెమరాల్లో రికార్డు అయ్యే ఫుటేజీని పరిశీలించుకోవచ్చు. వచ్చే నెల 4వ తేదీనా జిల్లాలోని 8 నియోజకవర్గాల కౌంటింగ్ ప్రియదర్శిని కళాశాలలోనే జరగనుంది.