
Clock Of Nellore ( Nellore Rural ) – ఒక్క ఛాన్స్ పేరుతో ముఖ్యమంత్రి పీఠమెక్కిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దిక్కులేని దివాణాగా మార్చారని, మరో సారి వైసీపికి అవకాశమిస్తే రాష్ట్రం వల్లకాడుగా మారుతుందని నెల్లూరు రూరల్ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్ధి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. త్వరలో జరిగే ఎన్నికల్లో వైసీపిని చిత్తుచిత్తుగా ఓడించి ప్రజా స్వామ్యాన్ని బ్రతికించాలని పిలుపునిచ్చారు. మాదరాజు గూడూరులో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి నిర్వహించిన రోడ్ షోకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం కోటంరెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వైసీపి అభ్యర్ధులు ప్రజల్లోకి వస్తూ తమకు ఓటు వేయాలని కోరుతున్నారని, వారి అబద్ధపు ప్రసంగాలను నమ్మవద్దని సూచించారు. ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని, ఒక చేత్తో పది రూపాయలు ఇచ్చి మరో చేత్తో వంద రూపాయలు లాక్కుంటున్నారని విమర్శించారు. విజనరీ లీడర్ చంద్రబాబు నాయకత్వాన్ని ప్రజలు బలపరిచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని సూచించారు. వైసీపిని తరిమికొట్టాలని కోరారు. ఇష్టారీతిన కరెంటు ఛార్జీలు, నిత్యావసర ధరలు పెంచి సామాన్య, మధ్య తరగతి ప్రజలను వైసీపి ప్రభుత్వం పీల్చి పిప్పి చేసిందని విమర్శించారు. మరో సారి వైసీపి ప్రభుత్వం వస్తే రాష్ట్రం వల్లకాడుగా మారుతుందని ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఏప్రిల్, మే, జూన్ పెన్షన్ కు వెయ్యి రూపాయలు కలిపి జూలై నెలలో మొత్తం 7వేల పెన్షన్ ను చంద్రబాబు అందిస్తారని కోటంరెడ్డి వెల్లడించారు. వచ్చే నెల 13వ తేదీనా జరిగే పోలింగ్ లో సైకిల్ గుర్తుపై రెండు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని అభ్యర్ధించారు.