
Clock Of Nellore ( Gudur ) – గూడూరు వైసీపి సిట్టింగ్ ఎమ్మెల్యే వర ప్రసాద్ తనేంటో చేతల్లో చూపించి అందరికీ దిమ్మతిరిగే సమాధానమిచ్చారు. నియోజకవర్గంలో అందరితో సరదాగా… కలుపుగోలు ఉంటూ… ఆయనేదోలే… అనే విధంగా ఉండేవారు. పరిపాలన విషయంలో కఠినంగానే ఉండే వర ప్రసాద్… ప్రజలతో మాత్రం కలుపుగోలుగానే ఉంటూ వచ్చారు. వైసీపి అధిష్ఠానంతో పాటూ నియోజకవర్గంలోని వైసీపి నేతలు కూడా ఆయన్ను పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఈ దఫా టికెట్ లేదు అనే సంకేతాలు మాత్రం వైసీపి అధిష్ఠానం ముందే ఇచ్చేసింది. ఇక అందరూ వర ప్రసాద్ పని అయిపోయిందని, ఆయన రాజకీయ జీవితం ముగిసిపోయిందని భావించారు. సరిగ్గా అదే సమయంలో వర ప్రసాద్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసి తిరుపతి టికెట్ కోరారు. అయితే పవన్ కళ్యాణ్ తిరుపతి పార్లమెంటు టికెట్ జనసేన తీసుకోవడం లేదని స్పష్టం చేసేశారు. అదే తరుణంలో పొత్తుల్లో భాగంగా తిరుపతి పార్లమెంటు స్థానాన్ని బిజేపికి కేటాయించారు. బిజేపి ఖరారయిందని నిర్ధారణ కాగానే రంగంలోకి దిగిన వర ప్రసాద్ తన రాజకీయ అనుభవానికి పనిబెట్టారు. కట్ చేస్తే ఆదివారం ఉదయం ఢిల్లీలో బిజేపి కండువా కప్పుకున్నారు. సాయంత్రం ఆయన్ను తిరుపతి పార్లమెంటు అభ్యర్ధిగా బిజేపి ప్రకటించింది. దీన్ని చూసిన కొందరు రాజకీయ నేతలు ముక్కున వేలేసుకున్నారు. ఆయనేదోలే అనుకుంటే ఇదేంట్రా బాబు అని చర్చించుకుంటున్నారు. వర ప్రసాద్ కు ఢిల్లీ స్థాయిలో లాబీ ఉందా అని చెవులు కొరుక్కుంటున్నారు. ఎవరి ద్వారా బిజేపిలో చేరారు అని ఆరా తీస్తున్నారు. తిరుపతి బిజేపి ఎంపి అభ్యర్ధిగా వర ప్రసాద్ పేరు ఖరారు కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు క్యాడర్ లో ఐఏఎస్ అధికారిగా పనిచేసిన వర ప్రసాద్… 2009 లో ఉద్యోగానికి స్వచ్ఛంధంగా రాజీనామా చేసి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీ నుండి 2009లో తిరుపతి ఎంపి అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత 2014లో వైసీపిలో చేరి అదే స్థానం నుండి పోటీ చేసి ఎంపిగా విజయం సాధించారు. తర్వాత 2019 ఎన్నికల్లో గూడూరు అసెంబ్లీ నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. త్వరలో జరిగే ఎన్నికల నేపద్యంలో వైసీపి టికెట్ నిరాకరించడంతో బిజేపిలో చేరిన వర ప్రసాద్… తిరుపతి పార్లమెంటు టికెట్ ను దక్కించుకుని మరో సారి ఎంపి అభ్యర్ధిగా బరిలో దిగనున్నారు. తన అదృష్ఠాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తానికి వర ప్రసాద్ కేవలం ఒకే ఒక్క రోజులో బిజేపిలో చేరడం, టికెట్ ను సాధించడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి.