Clock Of Nellore ( Sri City ) – తిరుపతిజిల్లాలోని పారిశ్రామిక వాడ అయిన శ్రీసిటీలో మెడికవర్ క్లినిక్ ప్రారంభమైంది. నెల్లూరులోని మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు అనుసంధానంగా కొనసాగనున్న ఈ క్లినిక్ ను శ్రీసిటీ డిఎస్పీ పైడేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ డాక్టర్ ధీరజ్ రెడ్డి, మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ సెంటర్ హెడ్ డాక్టర్ బింధు భార్గవ రెడ్డి, మార్కెటింగ్ హెడ్ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీసిటీలో మెడికవర్ సంస్థ క్లినిక్ ఏర్పాటు చేయడం ఏంతో ఉపయోగకరమని డిఎస్పీ పైడేశ్వరరావు అన్నారు. మెడికవర్ సేవలను స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ ప్రతీ రోజూ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకూ క్లినిక్ పనిచేస్తుందని చెప్పారు. రెగ్యులర్ డ్యూటీ డాక్టర్ తో పాటూ రోజుకొక స్పెషలిస్ట్ డాక్టర్ అందుబాటులో ఉంటారని, నెల్లూరులోని మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు ఈ క్లినిక్ అనుసంధానంగా ఉంటూ అత్యవసర చికిత్సలలో భాగంగా మరింత మెరుగైన సేవలు అందించడం జరుగుతుందన్నారు. క్లినిక్ ఏర్పాటుకు సహకరించిన శ్రీసిటీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. మరో వైపు శ్రీసిటీ పరిధిలో ఆరోగ్య సదుపాయాల్లో భాగంగా మెడికవర్ క్లినిక్ ప్రారంభం కావడంపై శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. దీని సేవలను శ్రీసిటీ ప్రాంతంలో నివాసం ఉండే పరిశ్రమల ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీసిటీ ఆపరేషన్స్ ప్రెసిడెంట్ సతీష్ కామత్ కూడా పాల్గొన్నారు.