
Clock Of Nellore ( Nellore ) – ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్ఠికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారంకు నిరంతరం పనిచేస్తున్న గ్రామ, వార్డు వాలంటీర్లు ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్నారని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న వాలంటీర్లకు పురస్కారాలు అందించడం సంతోషంగా ఉందని నెల్లూరు రూరల్ వైసిపి ఇంఛార్జ్, ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని పరమేశ్వరి కళ్యాణ మండపంలో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఆదాల పాల్గొన్నారు. 1, 2, 12, 17, 18, 19 డివిజన్లకు సంభందించిన వాలంటీర్లకు నగర మేయర్ స్రవంతి, డిసిసిబి మాజీ ఛైర్మైన్ ఆనం విజయకుమార్ రెడ్డితో కలిసి సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర పురస్కారాలను అందజేశారు. అనంతరం ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మానవసేవే మాధవ సేవగా భావించిన ముఖ్యమంత్రి జగన్ ఆశయాల సాధనలో కీలకభూమిక పోషిస్తున్న వాలంటీర్లకు భవిష్యత్తులో మంచి మేలు జరుగుతుందని, ఆదిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని అన్నారు. నిస్వార్ధంతో ప్రజా సేవ చేస్తూ, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి ఫలాలను, పథకాలను ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు అందిస్తున్న వాలంటీర్లు ప్రభుత్వంలో కీలక భూమి అని పేర్కొన్నారు. వాలంటీర్లకు త్వరలోనే సిఎం జగన్ శుభవార్త చెప్పబోతున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విజయడైరీ ఛైర్మైన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, వైసిపి నగర అధ్యక్షులు సన్నపురెడ్డి పెంచలరెడ్డి, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.