
Clock Of Nellore ( Nellore ) – త్వరలో జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలే స్టార్ క్యాంపైనర్లు అని నెల్లూరు రూరల్ వైసిపి ఇంఛార్జ్, ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నారు. నా వల్ల మీకు మంచి జరిగి ఉంటేనే ఓటు వేయండని ప్రజలను ధైర్యంగా అడిగిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడిలా ఎన్నికల్లో అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకోవడం జగన్ నైజం కాదని ప్రజలకు సూచించారు. నెల్లూరు పరమేశ్వరి కళ్యాణ మండపంలో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో మేయర్ స్రవంతితో కలిసి ఆదాల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 32, 33, 34, 35, 36, 37, 38, 41 డివిజన్లకు చెందిన పలువురు వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆదాల మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారుల ఇంటి గుమ్మం ముందుగే చేర్చుతున్నారని కొనియాడారు. ముఖ్యమంత్రి ఆశయానికి అనుగుణంగా పనిచేస్తున్న వాలంటీర్లకు రానున్న రోజుల్లో గొప్ప మేలు జరగబోతుందని, ఆ దిశగా ముఖ్యమంత్రి జగన్ ఆలోచన చేస్తున్నారని వెల్లడించారు. నెల్లూరు రూరల్ లో తన విజయం ఖాయమని ఆదాల స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విజయడైరీ ఛైర్మైన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, వైసీపి నగర అధ్యక్షులు సన్నపురెడ్డి పెంచలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.