
Clock Of Nellore ( Amaravathi ) – నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై అసెంబ్లీ సమవేశాల్లో ఏకరువు పెట్టారు నెల్లూరుజిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మానుగుంట మహిధర్ రెడ్డి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే స్వయంగా చెప్పినా పనులు జరగడం లేదని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఆవేదన వ్యక్తం చేయగా, తొందరపడి కొన్ని పనులు చేస్తే పొరపాట్లు దొర్లుతాయంటూ కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డి ప్రభుత్వానికి ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. అసెంబ్లీలో ముందుగా కందుకూరు ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి మాట్లాడారు. భూమి రీ సర్వే పథకం అద్భుతమని కొనియాడారు. అయితే ఈ సర్వేను హడావిడిగా చేస్తే పొరపాట్లు జరిగే అవకాశం ఉందని, రెవెన్యూ అధికారుల సమన్వయంతో రీ సర్వే చేయాలని ప్రభుత్వానికి సూచించారు. సీలింగ్ చట్టంలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయని, అయితే ప్రభుత్వం చేపట్టిన రీ సర్వేలో సీలింగ్ భూముల నిబంధనలను ప్రస్తావించలేదని గుర్తు చేశారు. తన నియోజకవర్గంలో ఎస్టీలకు చెందిన భూములను కొందరు పెద్దలు ఆక్రమించుకుని అధికారుల ద్వారా పాసు పుస్తకాలు కూడా పొందారని, దీనిపై అధికారుల కమిటి వేసి ఆ భూములు తిరిగి ఎస్టీలకు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మహిధర్ రెడ్డి కోరారు.
కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలోని తీర ప్రాంత గ్రామాలకు వెళ్లాలంటే ప్రధానమైన రోడ్డు తుమ్మలపెంట రోడ్డు అని ప్రభుత్వానికి సూచించారు. గడచిన నాలుగేళ్లుగా ఆ రోడ్డు పనులు జరగలేదని చెప్పారు. ప్రస్తుతం ఆ రోడ్డు గుంతలుగా మారి ప్రమాదకరంగా మారిందని తక్షణం రోడ్డు పనులు ప్రారంభించాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావలి పర్యటనకు వచ్చినప్పుడు అధికారులకు స్వయంగా ఆ రోడ్డుపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఇప్పటి వరకూ పనులు ప్రారంభిలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరారు. అలాగే కావలి ప్రధాన రహదారి విస్తరణ పనులు నిలిచిపోయాయని దాన్ని పూర్తి చేసేందుకు నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కోరారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్భర్ పనులు 90 శాతం పూర్తయ్యాయని, మిగిలిన 10 శాతం ఎన్నికల లోపు పూర్తి చేసి సిఎం చేతుల మీదుగా దాన్ని ప్రారంభించాలని వేడుకున్నారు. ఇంకా పలు సమస్యలను ప్రస్తావించారు.