Clock Of Nellore ( Kaluwai ) – ఉమ్మడి నెల్లూరుజిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతుంది. ఈనెల 13వ తేదీనా పాదయాత్ర నెల్లూరుజిల్లాలోకి ప్రవేశించింది. నాలుగు రోజుల పాటూ మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సారధ్యంలో ఆత్మకూరు నియోజకవర్గంలో పాదయాత్ర సాగింది. శుక్రవారం రాత్రి ఆత్మకూరు నుండి వెంకటగిరి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. కలువాయి మండలం, కుల్లూరులో లోకేష్ రాత్రి బస చేశారు. శనివారం తిరిగి తన పాదయాత్రను కొనసాగించారు. సాయంత్రం కుల్లూరులోని క్యాంపు సైట్ నుండి వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో మొదలైన లోకేష్ పాదయాత్ర కుల్లూరు, మాదన్నగారిపాళెం, చింతలపాళెం, వెంకట్రామరాజుపేట, ,సీతారాం పల్లి గ్రామాల మీదుగా పాదయాత్ర సాగింది. లోకేష్ పాదయాత్రలో టిడిపి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతే కాకుండా ఏ గ్రామం మీదుగా వెళ్తుంటే ఆ గ్రామానికి చెందిన ప్రజలు లోకేష్ పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొని ఫోటోలు దిగారు. అనేక మంది లోకేష్ ను కలిసి వారి వారి గ్రామాలకు చెందిన సమస్యలను వివరించి పరిష్కరించాలని వేడుకున్నారు. శనివారం రాత్రి 9 గంటల వరకూ పాదయాత్ర సాగింది. మరో వైపు శనివారం మధ్యాహ్నం క్యాంప్ సైట్ లో నారా లోకేష్ యానాదుల కులస్తులతో సమావేశమయ్యి వారి సమస్యలను తెలుసుకున్నారు. తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రాగానే కేవలం సంవత్సరం లోపే ఎస్టీ కాలనీల్లో పూర్తి స్థాయిలో రోడ్లు నిర్మిస్తామని, మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. అంతే కాకుండా యానాదుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారిని అన్నీ వర్గాల మాదిరిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని లోకేష్ స్పష్టం చేశారు.