Clock Of Nellore ( Nellore ) – సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలో మే 13న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి. యామిని పిలుపునిచ్చారు. శనివారం నెల్లూరు జిల్లా కోర్టు సముదాయంలోని ఆమె చాంబర్ లో మీడియాతో మాట్లాడారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ లో క్రిమినల్, సివిల్, కుటుంబ వివాదాలు మొదలైన అన్ని రకాల కేసులను పరిష్కరించుకునే అవకాశం ఉందని, క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు రాజీ పడి పరిష్కరించుకుంటే భవిష్యత్తులో విదేశాలకు వెళ్లాలన్నా, ఉద్యోగ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవని, సివిల్ కేసులో రాజీ పడితే ఇప్పటి వరకు కోర్టుకు చెల్లించిన ఫీజులన్నీ తిరిగి పొందవచ్చని ఆమె చెప్పారు. ప్రజలందరూ కూడా తమ సమయాన్ని, ఖర్చులను వృధా చేసుకోకుండా రాజీ మార్గంలో కేసులను పరిష్కరించుకునేందుకు ముందుకు రావాలని ఆమె సూచించారు. అలాగే ఈసారి జూనియర్ సివిల్ జడ్జీలు శిక్షణలో ఉన్నందున రెండు మూడు ప్రాంతాలకు సంబంధించి ఒక బెంచ్ ను ఏర్పాటు చేశామని, నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరికి కలిపి నాయుడుపేట కోర్టులో, ఆత్మకూరుకు సంబంధించి ఉదయగిరిలో ఒక బెంచ్ ను ఏర్పాటు చేశామని, కోటకు సంబంధించి కేసులన్నీ కూడా గూడూరు బెంచ్ లో పరిష్కరించుకోవచ్చని, మిగిలిన బెంచ్ లన్నీ యధావిధిగా పనిచేస్తాయని ఆమె స్పష్టం చేశారు. మే 13న జరిగే జాతీయ లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులను పరిష్కరించుకుని జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.