Clock Of Nellore ( Nellore ) – తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా విజయం సాధించిన వైసీపి అభ్యర్ధి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పక్కా వ్యూహంతో ముందుకెళ్లి అనుకున్నది సాధించారు. కృష్ణ చైతన్య విద్యా సంస్థల అధినేత అయిన చంద్రశేఖర్ రెడ్డికి అన్నీ రాజకీయ పార్టీలకు చెందిన పెద్దలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలే నేడు ఆయన విజయానికి కారణమయ్యాయి అనడంతో అతిశయోక్తి లేదు. అంతే కాకుండా అందరితో కలుపుగోలు తనం, వినయంతో ఉండటం ఆయనకు అదనపు ఆభరణాలు. కృష్ణ చైతన్య విద్యా సంస్థల అధినేతగా ఉన్న ఆయన ప్రైవేట్ విద్యా సంస్థల అసోసియేషన్ అధ్యక్షునిగా కూడా సేవలందించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి పోటీలో లేకుండా ఉండటం కూడా ఆయనకు కలిసొచ్చింది. దీంతో ఆ పార్టీలోని కొందరు ముఖ్యమైన నేతలు కూడా వారి వారి విద్యా సంస్థలకు చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుల చేత కూడా చంద్రశేఖర్ రెడ్డికే ఓటు వేయించినట్లు విశ్వసనీయ సమాచారం. పిడిఎఫ్, యూటిఎఫ్ సంఘాలకు చెందిన ఉపాధ్యాయులు కూడా చంద్రశేఖర్ రెడ్డి ఓటు వేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ముందస్తు వ్యూహంతో ముందుకెళ్లిన చంద్రశేఖర్ రెడ్డి… పార్టీలకు, సంఘాలకు అతీతంగా తనదైన రీతిలో ఉపాధ్యాయులను మెప్పించారు. వారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలుపొందారు. త్వరలోనే శాసన మండలిలో అడుగుపెట్టబోతున్నారు.