
Clock Of Nellore ( Vijayawada ) – జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని ఏపీపీఎస్సీ ( APPSC ) కార్యాలయాన్ని ముట్టడించిన భారతీయ జనతా యువమోర్చా. యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు కేతినేని సురేంద్ర మోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ముట్టడి కార్యక్రమానికి వివిధ జిల్లాల నుండి బిజేవైఎం నేతలు హాజరయ్యారు. నెల్లూరుజిల్లా అధ్యక్షులు యశ్వంత్ సింగ్ ఠాకూర్ ( BJYM ) ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షులు ప్రవీణ్ కుమార్, శివ ప్రసాద్, కత్తుల కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కార్యాలయ ముట్టడికి యత్నించిన కేతినేని సురేంద్ర మోహన్ తో పాటూ నెల్లూరు జిల్లా బిజేవైఎం అధ్యక్షులు యశ్వంత్ సింగ్ ఠాకూర్ ను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా యశ్వంత్ సింగ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఖాళీగా ఉన్న 2 లక్షలా 43వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఆ హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు. ప్రభుత్వ తీరు కారణంగా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతుందని వెల్లడించారు. ఉన్నత చదువులు చదివిన అనేక మంది ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కూలీలుగా మారిపోతున్నారని తెలిపారు. తక్షణం ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు.